TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్‌‌కి కోపమొచ్చింది

Published on: Sun Mar 12, 2017 4:39PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.... విపక్షాలపై విరుచుకుపడ్డారు. కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఒంటికాలిపై లేచారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్‌.... సభా మర్యాదకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సభా హుందాతనాన్ని కాపాడేందుకు కఠినంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.  గవర్నర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడు అల్లరి చేయడం రాజ్యాంగబద్ధమా అంటూ ప్రశ్నించారు. సభా మర్యాదను కాపాడటానికి సభ్యులందరూ హుందాగా ప్రవర్తించాలన్న కేసీఆర్‌.... ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని ఘాటుగా తేల్చిచెప్పారు.

 

కేవలం విమర్శించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడొద్దన్న కేసీఆర్‌.... మంచి చేస్తే ఒప్పుకోండి, తప్పు చేస్తే ఎత్తిచూపండంటూ సూచించారు. అంతేగానీ నిరాధార ఆరోపణలు చేయొద్దన్నారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

గవర్నర్‌ ప్రసంగంలో అబద్దాలుంటే నిరూపించండి.... ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానంటూ ప్రతిపక్షాలకు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. చిన్న తప్పు చేసినా భవిష్యత్‌ తరాలపై ఆ ప్రభావం పడుతుందని.... ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నామన్న కేసీఆర్‌..... రాజకీయ అవినీతి లేకుండా నిజాయితీగా, పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేకుండా చేయగలిగామన్న కేసీఆర్‌.... 2019లోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతామన్నారు.