TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవి "తీరని కోరిక" తీర్చబోతున్న కేసీఆర్‌

Published on: Sat Jun 11, 2016 1:13PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. "గాడ్ ఫాదర్" లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన క్రమశిక్షణ, పట్టుదలతో మెగాస్టార్‌గా ఎదిగిన చరిత్ర ఆయన సొంతం. ఎన్ని రికార్డులున్నా, ఎన్ని ఘనతలు సాధించినా చిరంజీవికి ఒక తీరని కోరిక అలాగే మిగిలిపోయింది. అదే "స్టూడియో అధినేత" అన్నపేరు. పరిశ్రమను ఏకఛత్రాధిపత్యం కింద ఏలిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు సొంతంగా స్టూడియోలున్నాయి. నిర్మాత రామానాయుడుకి కూడా స్టూడియో ఉంది. వీళ్లంతా స్డూడియో ఓనర్లు అనిపించుకున్నారు. కాని ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా తనకు స్టూడియో లేకపోవడం చిరంజీవిని వేధిస్తోంది. వెండితెరపై వెలుగుతున్న కాలంలోనూ..కేంద్రమంత్రిగా పవర్‌లో ఉన్నపుడు కూడా స్టూడియో కట్టాలని చిరు తెగ ట్రై చేశాడు. కానీ అది అందని "ద్రాక్షే" అయ్యింది.

 

మొన్నామధ్య ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి చిరంజీవి  విశాఖలో స్టూడియో కట్టబోతున్నట్టు వార్తలు వినిపించినా..అవి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవి "తీరని కోరిక" తీర్చేందుకు ముందుకువచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చిరు స్టూడియో నిర్మించబోతున్నారని దానికి తన ఇంటిపేరు అయిన "కొణిదెల"ను ఖరారు చేశారని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ వందో సినిమా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించాల్సిందిగా చిరు, కేసీఆర్‌ను కోరినట్టు సమాచారం. చిరు అడగటంతో అక్కడికక్కడే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆయన హామీ కార్యరూపం దాల్చితే చిరు తీరని కోరిక తీరినట్లే. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాలి.