TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దెయ్యం దెబ్బకు ఇల్లు ఖాళీ చేసిన ముఖ్యమంత్రి

Published on: Thu Apr 13, 2017 4:37PM

దెయ్యం..తరాలు మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ మాట చెబితే చాలు ఎవరైనా వణకాల్సిందే. నిరాక్ష్యరాస్యులైనా..ఉన్నత విద్యావంతులైనా దీనికి అతీతం కాదు..ఇప్పుడు ఈ జాబితాలోకి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేరిపోయారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సీఎం దెయ్యానికి భయపడటమేంటి అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ దెయ్యాలున్నాయన్న కారణంతో అధికారిక నివాసాన్ని గెస్ట్‌హౌస్‌గా మార్చేశారు. మొదట దీనిని ఎవ్వరూ నమ్మలేదు. అయితే భవనాన్ని శుద్ధి చేయడానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను గత వారాంతంలో పిలిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

 

రాజధాని ఈటానగర్‌లోని ఎత్తైన కొండపై 2009లో రూ.60 కోట్ల వ్యయంతో కొండమీద ఈ బంగ్లాను కట్టారు. ఈ భవంతిని కట్టిన తర్వాత ఏడుగురు ముఖ్యమంత్రులు మారగా..వారిలో దోర్జీ ఖండూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించగా, జార్బోమ్ గామ్లిన్ అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత నబమ్ టుకీ సీఎం కావడం జరిగింది. బంగ్లా నిర్మాణంలో లోపం ఉందని గ్రహించిన ఆయన ఒక వాస్తు పండితుడిని సంప్రదించి సరిచేయించుకున్నారట. ఆయనప్పటికీ నబమ్ పదవి పోయి..కలిఖో పుల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం..సుప్రీం జోక్యంతో నబమ్ తిరిగి సీఎం కావడం జరిగింది..అయితే ఆశ్చర్యకరంగా తీర్పు వచ్చిన కొద్ది రోజులకే కలిఖో ఫుల్ మృతదేహం బంగ్లాలోని ఫ్యాన్‌కే వేలాడుతూ కనిపించింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత బంగ్లా సిబ్బందిలో ఒకరు కూడా ఆ పక్క గదిలోనే ఫ్యాన్‌కే వేలాడుతూ కనిపించారు.

 

టుకీ ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు. ఆయన తర్వాత పెమా ఖండూ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బంగ్లాలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న ఖండూ బంగ్లాలోకి వెళ్లలేదు. దీంతో ఆ భవంతిని గెస్ట్‌హౌస్‌గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసమే శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు పూజారులు, రుషులు, చర్చి ఫాదర్లు, దర్గా పెద్దలు అందరూ ప్రార్ధనలు జరిపి, భవనంలోని ప్రతి గదికి ఆశీర్వచనాలు ఇచ్చి గెస్ట్‌హౌస్‌ను తెరిచారు. అయితే ఇంత జరిగిన తర్వాత ఆ బంగ్లాలోకి వెళ్లడానికి ఎవ్వరైనా సాహసిస్తారా..?