మనసున్న ముఖ్యమంత్రి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పెద్ద మనసును చాటుకున్నారు. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలంలోని ఆర్ఎస్ కొత్తపల్లే గ్రామానికి చెందిన 9 నెలల బిడ్డ జ్ఞానసాయి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్య శాస్త్ర పరిభాషలో బిలిరియా అట్రాసియా అంటారు. చికిత్స కోసం ఇప్పటి వరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. పాప బతకాలంటే మరో 30 లక్షల రూపాయలు కావాలి. కానీ అంత స్థోమత వారికి లేదు. దీంతో బిడ్డను చంపుకునేందుకు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్నారు.

 

ఈ విషయం మీడియా వెలుగులోకి తీసుకురావడంతో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పాప పరిస్థితి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. చిన్నారికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి, ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లను ఎంపిక చేసి చిన్నారికి వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.