ఆయన చంద్రుడు… ఆంధ్ర రాష్ట్రమొక కలువ!

కొందరు అదృష్టం కొద్దీ ఎదుగుతారు. కొందరు ఎదగటం జాతి అదృష్టం! ఏప్రెల్ 20, 1950న పుట్టిన చంద్రబాబు అదృష్టం కొద్దీ ఎదగలేదు. కఠోర శ్రమని నమ్ముకున్నారు. ఇప్పటికీ విరామం ఎరగక పని చేస్తారాయన. అటువంటి నాయకుడు లభించటం తెలుగు వారి అదృష్టం! ఆయనంటే పడని వారు, ప్రత్యర్థి పార్టీల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు మహానేత అంటే ఒప్పుకోకపోవచ్చు. కాని, నాయకత్వం కేవలం హావభావాల్లో, ఆహా ఓహో అనిపించే పంచ్ డైలాగుల్లో వుండదు! గుక్క తిప్పుకోకుండా చేసే ప్రసంగాల్లో అస్సలు వుండదు. జనాల జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పుకి నాయకుడు కారణం , కర్త కావాలి! అప్పుడే అది విజయం అనిపించుకుంటుంది!

 

నారా వారి పల్లెలో పుట్టి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి దాకా తన గమనం సాగించిన చంద్రబాబు ప్రేరణ పొందాలనుకునే వారికి అడుగడుగునా తన అడుగుజాడలు చూపిస్తారు. ఆయన ఎదుగుదల కేవలం ఒక రాజకీయం కాదు. నాటకీయం అంతకన్నా కాదు. ప్రాక్టికల్ గా ఒక స్టెప్ తరువాత మరో స్టెప్ వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒక సాదాసీదా వ్యవసాయ కుటుంబం నుంచీ వచ్చి ఇప్పటి వరకు మొత్తం ఆంధ్ర దేశాన్ని తన క్షేత్రంగా మార్చుకుని అభివృద్ధి సాగు చేస్తున్నారు. భావి తరాల కోసం అమరావతిని నారు వేసి, నీరు పోసి పెంచి పెద్ద చేస్తున్నారు!

 

స్కూలు జీవితంలో ఎందరో మధ్య తరగతి గ్రామీణ విద్యార్థుల్లాగే చంద్రబాబు కూడా మైళ్లు నడిచి వెళ్లి చదువుకునేవారు. కాని, తనతో బడికి వచ్చిన వారంతా తమ ఊరికో, జిల్లాకో పరిమితం అయిపోతే ఆయన మాత్రం తిరుపతి మీదుగా హైద్రాబాద్ దాకా వచ్చారు! చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎదుగుదల ఆయన ఆరాధించే వెంకన్న దయ అయితే కావొచ్చు… కాని, దానితో పాటూ ఆయన తెలివిగా వేస్తూ వచ్చిన అడుగులు కూడా! కాంగ్రెస్ లో వున్నా, టీడీపీలో వున్నా, ఇప్పుడు తానే టీడీపీగా మారిపోయినా… ప్రతీ మలుపులోనూ ఆయన తెలివిని, దార్శనికతని మనం చూడొచ్చు. మొదట్లో ఎమ్మెల్యే అవ్వటానికి, ఎన్టీఆర్ అల్లుడు అవ్వటానికి, రాష్ట్ర మంత్రి అవ్వటానికి… ఆయన ఎంత నిజాయితీగా కృషి చేశారో… ఆ తరువాత అంతే నిజాయితీగా రాష్ట్ర సంక్షేమం కోసం పాటుబడ్డారు. అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన ఆయన బిర్యానీ గురించి గొప్పగా చెప్పుకునే హైద్రాబాద్ కు ఐటీ ఘుమఘుమలు జోడించారు! చార్మినార్ బొమ్మతో చూపించే భాగ్యనగరిని సైబర్ టవర్స్ తో సరికొత్తగా ఆవిష్కరించారు! రాజకీయ శత్రువులు, కొందరు మేధావులు హైద్రాబాద్ మేకోవర్ లో చంద్రబాబు పాత్రని తక్కువ చేయోచ్చు. ఒప్పుకోకపోనూ వచ్చు. కాని, చరిత్ర మాత్రం ఆయనని నిజాముల నగరానికి నిఖార్సైన నిగనిగలు తెచ్చినవాడిగా తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది!

 

అధికారంలో వున్నప్పుడు అమెరికా అధ్యక్షుడ్ని అయినా ఆహ్వానించవచ్చు. కాని, ప్రతిపక్షంలో వున్నప్పుడు స్వంత రాష్ట్ర సీఎంనే తట్టుకోలేము! అదీ మన ప్రత్యర్థి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ అగ్నిపర్వతం అయితే… ఆ వేడి తట్టుకోవటం మరింత దుర్భరం! అయినా చంద్రబాబు పదేళ్లు ఆ పాత్రలోనూ పరిణతితో ఇమిడిపోయారు! ముఖ్యమంత్రిగా దూకుడు చూపితే… ప్రతిపక్ష నేతగా తెగువ చూపారు! కాంగ్రెస్ సీఎంలు ఎందరు మారుతూ , జగన్ మరోవైపు నుంచీ ఎంతటి తుఫానులా తరుముకొచ్చినా, రాష్ట్ర విభజన పేరున సోనియా వైపు నుంచి ఎంత రాజకీయం నడిచినా…. చంద్రబాబు కదలక మెదలక తొణకకుండా నెగ్గుకొచ్చారు! అదే అతనిలోని నాయకత్వ పటిమకు నిదర్శనం!

 

నిజాముల కాలం నుంచీ రైళ్లు, విమానాలతో తులతూగిన హైద్రాబాద్ ను చంద్రబాబు ఎంత గొప్పగా రూపు మార్చారో అందరికీ తెలుసు! కాని, కనీసం అసెంబ్లీ, సచివాలయం కట్టుకోడానికి భూములు కూడా లేని అమరావతిని ఆయన నవ్యాంధ్రాలో పరమాద్భుతంగా ఆవిష్కరించారు! ప్రతీ రోజూ అమరావతి విషయంలో కోడి గుడ్డుపైన ఈకల ఛందంగా విమర్శలు చేసేవారు ఎందరున్నా… ఇవాళ్ల దుర్గమ్మ పాదాల చెంత కొత్త చరిత్రకు రచన జరుగుతోందంటే అందుకు కారణం… చంద్రబాబు చాతుర్యం, అనుభవం, ఓర్పు తప్ప మరొకటి కాదు.  66ఏళ్ల ఆయన తాపీ పట్టుకుని తాపీగా మరో హైద్రాబాద్ నిర్మాణం చేస్తున్నారు ఆంధ్రుల కోసం...

 

రాష్ట్ర విభజనతో అనుకోని మలుపులో అనూహ్య స్థితిలో చిక్కిన ఆంధ్ర రాష్ట్రానికి… ఇప్పుడు చంద్రబాబు అవసరం ఎంతైనా వుంది. అందుకే, ఆయన జనం తన మోపిన బాధ్యతని ఎప్పటిలాగే సమర్థంగా నిర్వహిస్తూ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అందరం కోరుకుందాం!