సుప్రీంకోర్టులో సంక్షోభం.. సీజేఐతో "ఆ నలుగురు" భేటీ

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సక్రమంగా లేదంటూ నలుగురు సీనియర్ జడ్జిలు ఏకంగా మీడియా ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అక్కడ ఏదో జరుగుతుందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని సుప్రీంలో సంక్షోభాన్ని సరిదిద్దాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి దీపిక్ మిశ్రా రంగంలోకి దిగారు.

 

ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌తో సమావేశమయ్యారు. ఇవాళ సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవ్వడానికి ముందు ఈ భేటీ జరిగింది. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇతర న్యాయమూర్తులెవరూ పాల్గోనలేదని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.. అయితే ఈ భేటీలో ఏం జరిగింది.. ఏం చర్చించారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.