చిదంబరం అరెస్ట్.. గోడ దూకి?

 

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దాదాపు గంట హైడ్రామా తరువాత ఈ అరెస్ట్‌ చోటుచేసుకుంది. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికెళ్లిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది.

చిదంబరం అరెస్ట్ ఊహించిందే. 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులకు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని సీబీఐ, ఈడీ చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు అందుకున్నారని కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మంగళవారమే చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అయితే అక్కడ ఆయన లేకపోవడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. అజ్ఞాతంలో ఉంటూనే.. మరోవైపు ఆయన సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే ఆయన సుప్రీంను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అరెస్ట్ చేయకుండా ఉండాలని ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అయితే ఊహించని విధంగా బుధవారం రాత్రి 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమైన చిదంబరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాను ఏ నేరమూ చేయలేదని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆ తర్వాత అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా.. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. ఎంతసేపటికీ గేటు తెరవకపోవడంతో అధికారులు గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడి అనంతరం అరెస్ట్ చేశారు. కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన్ను తరలించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో కేసులో ఈ రాత్రికి సీబీఐ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశముంది.