చికెన్ తక్కువగా వేశారని..కన్న తల్లిదండ్రులనే..!

గతంలో ఎంతో బలమైన కారణం ఉంటే కానీ హత్యలు జరగేవి కావు..కానీ నేడు చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు కొందరు. చికెన్‌ తనకు తక్కువగా వేశారనే అక్కసుతో సొంత తల్లిదండ్రులనే హతమార్చే ప్రయత్నం చేశాడు ఓ దుర్మార్గుడు. సూర్యాపేట జిల్లా బాజిరెడ్డి గూడెనికి చెందిన బానోతు తార్య, సోమిలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు..ఇద్దరు కుమారులు తల్లిదండ్రులతోనే కలిసి నివసిస్తున్నారు..పెద్ద కుమారుడు శ్రీనుకు 2012లో వివాహమైంది..ఇతని ప్రవర్తన నచ్చకపోవడంతో పెళ్లైన కొద్దిరోజులకే భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. నాటి నుంచి శ్రీను పనిపాటా లేకుండా కాలం వెళ్లదీస్తుండటంతో తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి ఇంట్లో కోడి కూర వండారు..అందరూ భోజనానికి కూర్చొన్నారు. ఆ సమయంలో తనకు ముక్కలు తక్కువగా వేశారని తల్లిదండ్రులను తిట్టాడు శ్రీను..ఆ తర్వాత అతని తమ్ముడు, మరదలు ఇంట్లో పడుకోగా..ఇంటి ముందు వరండాలో తల్లిదండ్రులతో కలిసి శ్రీను పడుకున్నాడు. అంతా గాఢనిద్రలో ఉండగా శ్రీను తండ్రి తార్యాను గొడ్డలితో నరికాడు..దీంతో ఆయన గట్టిగా అరవడంతో తల్లి సోమిలి అడ్డు రావడంతో ఆమె తలపై నరికి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిద్దరిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.