TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నోరుజారిన చెవిరెడ్డి.. మెగా అభిమానులకు కోపమొచ్చింది!!

Published on: Fri Oct 11, 2019 3:02PM

 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఈరోజు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో జగన్ అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి ఈ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించేందుకే ఆయనను కలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి. సీఎం అపాయింట్‌మెంట్ కోరిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. దీంతో చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి జగన్‌ను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అనివార్య కారణాల వలన ఈ భేటీని 14వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.

అయితే ఇంతలోనే, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి చిరంజీవిని కించ పరిచేలా ఒక పోస్ట్ వెలువడింది. ” ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి, చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జగన్ అరెస్ట్ అయ్యారు. అప్పుడు రామ్ చరణ్ సంతోషం పట్టలేక, 'చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది' అని కామెంట్ చేసారు. వైయస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి. అదే తండ్రీ కొడుకులు ఇప్పుడు జగన్ దర్శనం కోసం పడిగాపులు పడి అనుమతి సంపాదించారు. తన సినిమాను ప్రత్యేకంగా చూడాలంటూ ప్రార్థించబోతున్నారు. అదే కాల మహిమ అంటే” అని రాసుకొచ్చారు. 

అయితే చెవిరెడ్డి వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుని కూడా తన సినిమా చూడమని చిరంజీవి అడిగారని, అదే కోవలో ఇప్పుడు జగన్ ని కోరుతున్నారని, దీన్ని ఆసరాగా తీసుకుని చిరంజీవిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారంటున్నారు. స్వయం కృషితో పైకి వచ్చిన చిరంజీవి మీద విమర్శలు చేసే స్థాయి చెవిరెడ్డి కి లేదని మండిపడుతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి, ఈరోజు శుక్రవారం కాబట్టి , అక్రమ ఆస్తుల కేసులో విచారణ కోసం జగన్ కోర్టుకు హాజరు కావాలని, అందుకే జగన్ అపాయింట్మెంట్ వాయిదా వేసి ఉంటారని సెటైర్ వేస్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి సోషల్ మీడియా అకౌంట్ లో వచ్చిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.