అచ్చెన్నాయుడిని బంట్రోతు అన్న చెవిరెడ్డి.. సభలో కలకలం

 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్ కు వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో కోడెలను స్పీకర్ గా ఎన్నుకోగానే జగన్ స్వయంగా చేయిపట్టుకుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున టీడీపీ కంటే వైసీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఓ బలహీనవర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు టీడీపీ నేతలకు మనసు రాలేదు. స్పీకర్ బలహీనవర్గాలకు చెందినవారు కాబట్టే మీ చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదు అధ్యక్షా. అదే స్థానంలో తమ సామాజికవర్గం వ్యక్తి ఉండి ఉండే చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్పీకర్ ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు తన బంట్రోతును పంపారు’ అని చెవిరెడ్డి అచ్చెన్నాయుడిని పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. చెవిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, వెనక్కి తగ్గేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు తనను చంద్రబాబు బంట్రోతుగా చెవిరెడ్డి అభివర్ణించడంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ ను తాను గౌరవంగా కుర్చీవరకూ వచ్చి కూర్చోబెట్టానని గుర్తుచేశారు. 'అధ్యక్షా.. చంద్రబాబు తన బంట్రోతును పంపారు అన్న మాట మీకు తీపిగా ఉంటే దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మేము ఎమ్మెల్యేలమా? లేక బంట్రోతులమా? అన్నది మీరే తేల్చాలి. ఒకే.. మేము చంద్రబాబు బంట్రోతులం అయితే మీరు 150 మంది శాసనసభ్యులం కాదని, జగన్ బంట్రోతులు అని ఒప్పుకోండి. మేం శాసనసభ్యులుగా, ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా సభకు వచ్చాం. శానససభ్యుడు తోటి శానససభ్యుడికి గౌరవం ఇవ్వాలి’ అని అచ్చెన్నాయుడు హితవు పలికారు.