జైలులో ఎర్రచందనం స్మగ్లర్ ను కలిసిన వైకాపా యం.యల్యే

 

ఎర్రచంద్రనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విజయానందరెడ్డి అనే వ్యక్తిని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అనేకమందిపై అనేక రకాల ఆరోపణలున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరెయ్యారు. ఇటువంటి తరుణంలో పోలీసులు అరెస్టు చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుకి చెందిన వ్యక్తిని వైకాపా నేత జైలుకి వెళ్లికలవడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. అయితే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధము లేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పడం విశేషం. తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగినా, దానిని అందరూ కల్లే అనుకొంటారు తప్ప పాలని ఎవరూ నమ్మరు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఆ వ్యక్తి తనకు మిత్రుడని స్వయంగా భాస్కరరెడ్డే చెపుతున్నపుడు ప్రజలకు అనుమానాలు కలగడం సహజమే. పైగా విజయానందరెడ్డి గంగాధర నెల్లూరుకు చెందిన వైకాపా కార్యకర్త అని చెవిరెడ్డి చెప్పడం వైకాపా ప్రతిష్టను మసకబారేలా చేస్తుంది. అన్ని విషయాలు స్వయంగా మీడియాకు చెప్పి, ఇప్పుడు మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని చెవిరెడ్డి బాధపడటం చాలా హాస్యాస్పదం.