చెన్నై కాలేజీ విద్యార్థుల పైత్యం.. బస్సు పైన విన్యాసం

 

చెన్నైలో కాలేజీ విద్యార్థులు బస్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రతి వేసవి సెలవుల తర్వాత తొలిరోజు కాలేజీలు తెరుచుకున్ననాడు బస్‌ డే వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కాలేజీ విద్యార్థులు మాత్రం వారిమాట వినకుండా బస్ డే వేడుకలు నిర్వహించారు.

ఈ సారి కూడా అదే వేడుకలో బస్సుపైకి ఎక్కి స్టంట్స్ చేసే ప్రయత్నం చేశారు. పచయప్పా కాలేజ్ మరియు అంబేడ్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు చెన్నై ప్రధాన రహదారిపై బస్‌ డే వేడుకలు నిర్వహించారు. సోమవారం బస్‌ డే వేడుకల్లో భాగంగా కాలేజీ విద్యార్థులు ఓ బస్సు టాప్‌ ఎక్కి కూర్చున్నారు. బస్సు లోపల కూడా విద్యార్థులతో పూర్తిగా నిండిపోయింది. మరికొందరు బయటకు వ్రేలాడారు. ఇక బస్సు కదిలింది. కొంతదూరం వెళ్లగానే ఎదురుగా బైక్ ఉండడంతో బస్సు డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సుపైన ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా కిందకు పడ్డారు. దాదాపు 30 మంది విద్యార్థులు కింద పడ్డారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఇందులో 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్‌ న్యూసెన్స్ కింద వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు కూడా బస్ డే వేడుకలపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ విద్యార్థుల్లో మాత్రం ఎలాంటి చలనం రాలేదు.

స్టూడెంట్స్ బస్సు పై నుంచి కిందపడటం అక్కడే ఉన్న కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది సమయంలోనే వీడియో వైరల్ అయ్యింది.