సమగ్ర సర్వేపై కీలక సమాచారం...

 

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన కీలక సమాచారం వెల్లడి అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఈ సమాచారాన్ని బయటకి వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఎన్యుమరేటర్లు ప్రజల దగ్గర వున్న ప్రతి సర్టిఫికెట్, కార్డుకు ఫొటోస్టాట్ కాపీ కావాలని అడుగుతుండటంతో ప్రజల్లో ఈ విషయంలో అయోమయం తలెత్తింది. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు దీనిపై భారీ సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో కమిషనర్ సోమేష్ కుమార్ ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి ఫొటోస్టాట్ (జిరాక్స్) కాపీలు ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. కేవలం ఒరిజినల్ ఐడీ కార్డులు చూపెడితే సరిపోతుందని వివరించారు. అందువల్ల మంగళవారం జరిగే సమగ్ర సర్వేకి సంబంధించి ఏ ఫొటోస్టాట్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు.