TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రోత్సాహం.. బ్యాటరీ సమస్యకు చెక్

Published on: Tue Feb 1, 2022 11:10AM

కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లీన్ ఎనర్జీని ప్రస్తావించారు. కాలుష్యాన్ని నివారించేందుకు, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కేంద్ర సర్కారు ఇప్పటికే ప్రోత్సహిస్తోంది. అయితే ఆశించిన రీతిలో అది సక్సెస్ కాకపోవడానికి కారణమేంటంటే... బ్యాటరీ చార్జింగ్ సమస్యే. దేశవ్యాప్తంగా వాహనదారుల అవసరాలు తీర్చేందుకు లెక్కలేనన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఈ మధ్య ప్రాచుర్యం లభించినా కూడా బ్యాటరీ చార్జింగ్ సమస్యే దానికి ప్రధాన గుదిబండగా మారుతోంది. దీంతో కొత్తగా వెహికల్ కొనేవాళ్లు, పర్యావరణ స్పృహ కలిగినవారు సైతం సంప్రదాయ వెహికల్స్ నే కొంటున్నారు తప్ప... ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మొగ్గు చూపడం లేదు. ఈ సమస్యను నివారించేందుకు ఈ బడ్జెట్ లో నిర్మల ఓ చక్కని పరిష్కారం చూపారు. బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లకు దేశవ్యాప్తంగా అనుమతిస్తామని, ఇందుకోసం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని, అవసరమైన భూములు కూడా అదే తరహాలో కేటాయిస్తామని తేల్చి చెప్పారు. దీనివల్ల ఒక వెహికల్ బ్యాటరీ చార్జింగ్ అయ్యేంతవరకు వాహనదారులు వెయిట్ చేయనక్కర్లేదు. తమ బ్యాటరీ అక్కడ పెట్టి మరో బ్యాటరీని తీసుకెళ్లేలాగా పాలసీని డిజైన్ చేస్తారు. అంటే సిలిండర్ మార్పిడి లాగా అన్నమాట. నిర్మల ఈ ప్రకటన చేయగానే అమరరాజా బ్యాటరీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఫీమ్ ఇండస్ట్రీస్, టీవీఎస్, సోనా బి.ఎల్.డబ్ల్యు., లుమాక్స్ ఇండస్ట్రియల్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి.