వేలానికి 'చేగువేరా' జన్మించిన ఇల్లు!

చేగువేరా.. ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. విప్లవ వీరుడిగా, పోరాట యోధుడిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశ, భాషలతో సంబంధం లేకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయనను చూడలేకపోయినా.. కనీసం ఆయన పుట్టిన ఇల్లు, ఆయన పెరిగిన నేలని చూడాలని ఎందరో భావిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఆయన పుట్టిన ఇంటిని సొంత చేసుకునే అవకాశమే వచ్చింది. చేగువేరా స్వస్థలం అర్జెంటీనాలోని రొసారియోలో ఆయన జన్మించిన ఇంటిని వేలానికి పెట్టారు. ఈ ఇంటిని 2000 సంవత్సరంలో కొన్నానని ప్రస్తుతం ఆ ఇంటికి యజమానిగా ఉన్న ఫ్రాన్సిస్కో ఫరుగ్గియా పేర్కొన్నారు. ఈ ఇల్లు 2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని ఓ సాంస్కృతిక కేంద్రంగా మారుద్దామని తాను భావించానని, కానీ కుదరకపోవడంతో వేలం వేయాలని అనుకుంటున్నానని ఫరుగ్గియా తెలిపారు. 

మరోవైపు, ఈ భవనానికి ఎంతో క్రేజ్ ఉంది. దీన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకలు వస్తుంటారు. ఈ ఇంటిని సందర్శించిన వారిలో ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్‌ పీపే ముజికా, క్యూబా మాజీ అధినేత ఫీడెల్ క్యాస్ట్రో సంతానం వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే, 1950 లలో మోటార్ ‌సైకిల్ ‌పై చేగువేరాతో పాటు దక్షిణ అమెరికావ్యాప్తంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్‌ ఆల్బర్టో గ్రానడోస్‌ కూడా ఈ ఇంటిని సందర్శించారు. అంతటి చరిత్ర ఉన్న చేగువేరా జన్మించిన ఇల్లు వేలానికి రావడంతో.. ఆ ఇంటిని ఎవరు సొంతం చేసుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.