TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాక్ పై కోపంతో మైసూర్ పాక్ పేరు మార్చేశారు!

Published on: Sat May 24, 2025 11:46AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు, పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఆ దేశం పట్ల వ్యతిరేకత, ఏహ్యత ఏ స్థాయిలో వ్యక్తం అవుతోందంటే.. దేశ ప్రజలంతా ఎంతో ఇష్టపడే స్వీట్ మైసూర్ పాక్ పేరు మార్చేయాలంటూ నెట్టింట ఓ రేంజ్ లో డిమాండ్ వినిపిస్తోంది.  ఈ డిమాండ్ కు అనుగుణంగా  ఓ మిఠాయి వాలా వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లలో పాక్ అనే పదం లేకుండా వాటి పేర్లు మార్చేశాడు. ఔను నిజంగా నెటిజనుల ప్రతిపాదన రాజస్థాన్ లోని ఓ స్ట్వీట్స్ దుకాణం యజమానికి విపరీతంగా నచ్చేసింది.  అంతే వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లకు పాక్‌ పదాన్ని తీసేసి ఆ స్వీట్లకు కొత్త పేర్లు పెట్టారు.  మైసూర్ పాక్  పేరును  మైసూర్ శ్రీగా మార్చేశారు.  

 జైపుర్‌లో గల ప్రముఖ  త్యోహార్‌ స్వీట్స్‌  యజమాని ఈమేరకు తమ దుకాణంలోని స్వీట్ల పేర్లకు పలు మార్పులు చేశారు.  ఒక్క మైసూర్ పాక్ పేరునే కాదు  మోతీ పాక్‌, ఆమ్‌ పాక్‌, గోండ్‌ పాక్‌ పేర్లను కూడా మార్చేశారు. వాటికి కూడా  మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్‌ శ్రీ అని కొత్తగా నామకరణం చేశారు. స్వర్ణ భాషం పాక్‌, చాందీ భాషమ్‌ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు.  

వాస్తవానికి స్వీట్లకు ఉన్న పేరులో పాక్ అన్న పదానికి, పాకిస్థాన్ కీ సంబంధం లేదు. పాక్ అనే పదానికి సంస్కృతంలో వండటం అని అర్ధం. అయినా ఆ పదం పాకిస్థాన్ ను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో.. ఆ పదం పలకడానికీ, వినడానికి ఇష్టం లేకనే తమ దుకాణంలో ఆ స్వీట్ల పేర్లు మార్చేశానని త్యోహార్ స్వీట్స్ యజమారి అంజలీ జైన్ తెలిపారు.