కాపు నేతల డిమాండ్....బాబు ఒప్పుకునేనా ?

పార్టీ ఓటమి పాలయ్యాక విదేశాలకి వెళ్లి రెస్ట్ తీసుకుని వచ్చిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. ఆయన ఊరిలో లేనప్పుడు కాపు నేతలు అందరూ కాకినాడ వెళ్లి పార్టీ నేత తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున రాజ్యసభ ఎంపీలు నలుగురు పార్టీ ఫిరాయించి ఏకంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్నే బీజేపీలో కలిపేశారు దీంతో ఈ కాపు నేతలు కూడా పార్టీ మారతారు అనే ప్రచారం గట్టిగా జరిగింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు వారి మీద ద్రుష్టి సారించినట్టు చెబుతున్నారు. 

అదే కాక నిన్న తాను నిర్వహించిన సమావేశానికి అందుబాటులో ఉండి కూడా హాజరుకాని నేతలపై ఆరా తీసిన చంద్రబాబు వాళ్లు ఎందుకు సమావేశానికి రాలేదని పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన కాపు నేతలు బొండా ఉమా, జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు, పంచాకర్ల రమేష్ బాబు లాంటి నేతల అసంతృప్తికి కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. బాబు ఆదేశాలతో ఇప్పటికే వీరితో కాపు సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, చినరాజప్పలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. 

అయితే వీరంతా పార్టీ మారాలని ఆ మీటింగ్ పెట్టుకోలేదని ఈ మీటింగ్ వెనుక ఒక ముఖ్య కారణం ఉందని అంటున్నారు. నిజానికి చంద్రబాబువ రేపు సాయంత్రం కాపునేతలతో భేటీ కానున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. కాకినాడ సమావేశానికి హాజరైన కాపు నేతలను చంద్రబాబు భేటీకి ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి వెళ్ళే వారు అందరూ ఓకే మాట మీద ఉన్నారని అంటున్నారు. పార్టీని బ్రష్టు పట్టించిన ఒక ఇద్ద‌రు నేత‌ల‌ను త‌ప్పించాల‌ని, అది కుదరని పక్షంలో ఎవరి దారి వాళ్ళం చూసుకుంటామని బాబుకి చెప్పనున్నట్టు సమాచారం. 

నిజానికి కాకినాడ సమావేశంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు అభ్య‌ర్దుల పైన వివ‌క్ష చూపించి లోకేష్ కమ్మ సామాజిక వర్గ అభ్యర్ధులకి స‌హ‌కారం ఎలా అందించించారనే విషయం మీదా వారి ప్రధాన చర్చ నడిచినట్టు సమాచారం.  లోకేశ్ పార్టీ వ్యవహారాల్లో ఉండడం వ‌ల‌నే పార్టీకి న‌ష్టం జ‌రిగింద‌ని, అదీ కాక ఎన్నిక‌ల వేళ‌ లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు పైన కాపు నేత‌లు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనతో పాటు గ‌త ప్ర‌భుత్వంలో ఆర్దిక శాఖా మంత్రిగా ప‌ని చేసిన య‌న‌మ‌ల సైతం త‌న‌ వారికే నిధుల మంజూరు చేసుకున్నారని ప్ర‌ధానంగా గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నేత‌ల విజ్ఞ‌ప్తుల‌ను ప‌ట్టించు కోలేద‌ని వారి ప్రధాన ఆరోపణ. 

ఈ ఇద్దరినీ పక్కన పెడితే తప్ప తాము పార్టీలో ఉఉండే ప‌రిస్థితి లేద‌ని రేపు బాబుకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో సుజనా చౌదరి అండతో బీజేపీ వైపు చూసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి కన్నకొడుకుని అత్యంత నమ్మకస్తుడు అయిన యనమలని పక్కన పెట్టేందుకు బాబు ఒప్పుకుంటారా ? లేదా ఒక్క సారిగా ఇంతమంది కాపు నేతలను వదులుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఈ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.