చలానా రాసినందుకు..పోలీసులపై ఎమ్మెల్యే భర్త దాడి

తన అనుచరుడి వాహనానికి చలానా రాశాడన్న కారణంతో ఎమ్మెల్యే భర్త పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌‌లోని కోటా జిల్లా మహవీర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బీజేపీ మహిళా ఎమ్మెల్యే చంద్రకాంత మేఘవాల్‌ వర్గానికి చెందిన ఓ కార్యకర్త తన వాహనంలో వెళుతుండగా..ట్రాఫిక్ పోలీసులు అతని వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు..డాక్యుమెంట్లు లేకపోవడంతో చలానా రాశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చంద్రకాంత ఆమె భర్త నరేంద్రతో కలిసి అక్కడికి చేరుకున్నారు.

వచ్చి రావడంతోనే డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ..దాడికి దిగారు. మర్యాదగా తమ అనుచరుడిని వదిలిపెట్టాలని, చలానా ఎందుకు రాశారని..డబ్బు చెల్లించే ప్రసక్తే లేదంటూ గొడవకు దిగి ఎమ్మెల్యే భర్త నరేంద్ర ఓ పోలీసుపై చేయిచేసుకున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నరేంద్ర మేఘవాల్‌పై కేసు నమోదు చేయాలనుకున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో జంకుతున్నారు. అయితే బీజేపీ నేతల ఒత్తిడితోనే ఎమ్మెల్యే భర్తను అరెస్ట్ చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.