ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000 కోట్లు ఖర్చు చేశాం

జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల పనులు నిలిచి పోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి కారణంగా రైతులు, పేదలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను లేఖలో వివరించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనులు గత 13నెలలుగా పెండింగ్‌లో పెట్టడం బాధాకరమన్నారు. 13 నెలలుగా అన్ని జిల్లాలలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. అన్ని జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు.

టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఈ ఏడాది కాలంలో అందులో మూడో వంతు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు నీరందించాలన్న సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి 2వ దశ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని అన్నారు. హంద్రీ-నీవా 2వ దశ పనులను 90 శాతం వరకు పూర్తి చేసి శ్రీశైలం నీటిని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం వరకు ప్రయోగాత్మకంగా విడుదల చేస్తే... ఆ ప్రాంతానికి నీళ్ళు రావడం చూసి ప్రజలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. అలాంటిది మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కనపెట్టిందని విమర్శించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ నీటిపారుదల పనులు పూర్తిచేసి ప్రభుత్వం రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.