కుప్పంలో కూడా కొంప మునిగేది: చంద్రబాబు
Published on: Tue Jun 4, 2019 1:08PM

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. కుప్పంలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై ఆరా తీశారు. గతంలో 70వేలు మెజారిటీ వస్తే ఈసారి 30 వేలే వచ్చిందని ఎందుకు తగ్గిందో కారణాలను తెలుసుకోవాలని కోరారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకూ నీళ్లు తెచ్చామని ఎందుకు మెజారిటీ తగ్గిందో అన్వేషించాలని టీడీపీ నేతలకు ఆదేశించారు. నియోజకవర్గంలోని కొందరు నేతల తీరు వల్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి నియోజకవర్గ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ట్రెండ్ మేరకే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ మెజారిటీ తగ్గిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మెజారిటీ తగ్గిందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెలాఖరుకు తాను కుప్పం లో పర్యటించనున్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీలో ప్రక్షాళన కూడ చేస్తానన్నారు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటానని బాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటే మెజారిటీ పెరిగేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. స్థానిక నేతల తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని కూడా బాబు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులే తనను కాపాడిందని... స్థానిక నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తితో కొంప మునిగేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అధికారం లేని సమయంలోనే మరింత క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
రాష్ట్రంలో టీడీపీ ఓటమిపై కూడా చంద్రబాబు స్పందించారు. మరోఐదేళ్లపాటు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లమని స్పష్టం చేశారు. మనం తప్పు చేయలేదు. ధైర్యంగా ముందుకెళ్దాం అంటూ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలంతా గతం మరిచి భవిష్యత్తు వైపు నడవాలని సూచించారు. చిన్నచిన్న లోపాలను సవరించుకుని భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే వైసీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


