జగన్ చర్యలతో చంద్రబాబుకు లాభం...

గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను కోరుతూ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తలపెట్టగా కార్యక్రమానికి ఎవరూ అనుమతులు తీసుకోలేదని, అదే సమయంలో గణతంత్ర దినోత్సవం, భాగస్వామ్య సదస్సు జరగనున్నది అని పోలీసులు ఆర్కే బీచ్ ను దిగ్భంధం చేశారు. ఎవరిని ఆర్కే బీచ్ దరిదాపులకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.  వైజాగ్ విమానాశ్రయం చేరుకున్న జగన్ ను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా బయటికి అనుమతించలేదు. దీంతో జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెనక్కి వెళ్లేది లేదని విమానాశ్రయంలోనే కూర్చుండి పోయిన విషయం తెలిసిందే.

సరిగ్గా అదే సన్నివేశం నేడు పునరావృతం అయింది. కానీ అధికార పక్షం ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయిందని ప్రతిపక్ష నాయకులు, జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు అనుకుంటున్నారు. నాడు తెలుగుదేశం అధికారంలో ఉండగా జగన్ ఏడాది పాటు పాదయాత్ర చేశారని, ఏనాడూ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూడలేదని, ఇవాళ్టి పరిస్థితులు ఆనాడు కల్పిస్తే జగన్ పాదయాత్ర జరిగేదా? అని తెలుగుదేశం వారు అంటున్నారు.

ఇదే సమయంలో  ఈ రోజు చంద్రబాబుని విశాఖపట్నంలో వైసీపీ అడ్డుకోవటం రాజకీయంగా వైసీపీ చేసిన తప్పటడుగుగానే కనిపిస్తోంది. గతంలో విశాఖలో జగన్ కు జరిగిన దానిని మనసులో పెట్టుకొని విశాఖపట్నం లో బాబును అడుగుపెట్ట నివ్వకూడదు అని తీసుకుని అమలు చేసిన నిర్ణయం ముమ్మాటికీ రాజకీయంగా బాబు కలిసి వచ్చేదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసిపి నాయకులు, కార్యకర్తలు  ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎంత విధ్వంసకారులో  ప్రజలకు చూపించడానికి బాబుకి ఇది కలిసివచ్చిన అవకాశమని విశ్లేషిస్తున్నారు.

అందులోనూ ఎక్కువమందిని ఒక గంట అని చెప్పి 500 రూపాయలకు మాట్లాడుకుని తెచ్చుకున్నారు అనేది బయట పడటం, పెందుర్తి లోని వైసీపీ నాయకుడికి చెందిన ఓ కాలేజి నుంచి విద్యార్థులని తెచ్చి వారితో నినాదాలు ఇప్పించడం వంటివి కూడా ప్రజలకు తెలిసిందని ఈ పరిణామాలు వైసీపీకి మరింత నష్టం కలగజేస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఏది జరిగినా చంద్రబాబుకే అనుకూలమవుతాయని తెలుగుదేశం వర్గాలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.