జగన్ ఆటకట్టిస్తా.. ప్రభుత్వంపై తిరుగుబాటుకు చంద్రబాబు పిలుపు..
Published on: Sat Oct 30, 2021 3:11PM
వైసీపీ నాయకుల ఆటకట్టిస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమను హస్తగతం చేసుకొని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన జోరుగా కొనసాగుతోంది. తొలుత లక్ష్మీపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించి.. అక్కడి నుంచి వరదరాజస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మధ్యలో స్థానికులతో కలిసి మాట్లాడారు. వారి సమస్యలు విన్నారు. ప్రభుత్వ పాలనా తీరుపై టీడీపీ అధినేతకు ఫిర్యాదులు చేశారు స్థానిక ప్రజలు.
అనంతరం భారీ ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ పాలనలో రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు.. ఆర్టీసీ ఛార్జీలు.. పథకాల్లో కోత విధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.


