దిక్కుమాలిన ప్రతిపక్షమన్న జగన్...అనుభవమంత వయసు లేదన్న బాబు !

 

ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం ఆవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 14 పనిదినాల్లో రాష్ట్ర బడ్జెట్‌తో పాటు వివిధ అంశాలను చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశాలు మొదలయ్యాయి. కరువు అంశం పై తొలిరోజే చర్చించాలని నిర్ణయించారు. 

ఇక కరవు, ప్రాజెక్టులపై జరుగుతున్న చర్చ మాటల యుద్ధానికి దారితీసింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం హైట్ పెంచారన్న జగన్ ఏపీకి రావాల్సిన కృష్ణా జలాలు అందుకే తగ్గిపోయాయని అన్నారు. అంతేకాక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ ప్రశ్నించడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని కూడా టీడీపీ డిమాండ్ చేసింది. 

ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే మంచిదే అన్న టీడీపీ గాడిద అని జగన్ అనడం మీద అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో గోదావరి మీద మీ అందరికీ క్లాస్ పీకుతాన్న సీఎం జగన్  గోదావరి ప్రవాహం, పాయలపై వివరించారు. ఈ సందర్భంగా. ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఉండదని జగన్ వ్యాఖ్యానించడం సభలో కలకలం రేపింది. దీంతో మాట్లాడిన మాజీ సీఎం చంద్రబాబు తన రాజకీయ అనుభవం అంత ముఖ్యమంత్రి జగన్ వయసు ఉందని అన్నీ తనకే తెలుసునని అనుకున్నట్లు వ్యవహరించరాదని అన్నారు. గోదావరి నీటి మళ్లింపుపై జగన్ చాలా తేలికగా మాట్లాడారని అన్నారు. 

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే  ఏపీ తెలంగాణ భారత్, పాకిస్తాన్ లు అవుతాయని జగన్ గతంలో అన్నారని, ఇప్పుడు మాట మార్చుకున్నారని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో నోరు మూయించవచ్చేమో కాని, బయట మూయించలేరని అన్నారు. భావితరాల భవిష్యత్తును తాకట్టు పెట్టే అదికారం ఎవరికి లేదని చంద్రబాబు అన్నారు. మంత్రి బుగ్గన లేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం కట్టింది,ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం నడుపుతన్నప్పుడే అని అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ అలా మాట్లాడారని, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇలా మాట్లాడుతున్నారని బుగ్గన అన్నారు.