చంద్రబాబు చాణక్యం Vs జగన్ చాపల్యం!

2014 సార్వత్రిక ఎన్నికలు జరిగి నాలుగేళ్లైపోతోంది. ఇక చివరి సంవత్సరం మొదలైనట్టే. అంటే, ఈ సారికి ఇది క్లైమాక్స్ ఇయర్ అన్నమాట! ఏపీకి సంబంధించినంత వరకూ 2019లో తగిన సమయానికే ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు కాబట్టి ముందస్తు సూచనలేం లేవు. మరి వచ్చే సంవత్సరం ఎండా కాలంలో ఎన్నికలంటే ఇప్పుడే హీట్ స్టార్ట్ అవ్వటంలో ఆశ్చర్యమేం లేదు కదా! అయితే రాష్ట్రంలోని ఒక్కో పార్టీ ఒక్కో అంశాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకెళుతోంది. తమకు అనుకూలంగా వుండబోయే వివాదాన్ని రచ్చకీడుస్తూ ఓట్లుగా మార్చుకోటానికి ట్రై చేస్తోంది. ప్రధానంగా రెండు ముఖ్యమైన పార్టీలైన టీడీపీ, వైసీపీ వేగంగా పావులు కదుపుతున్నాయి…

 

 

చంద్రబాబు గత కొంత కాలంగా రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. మోదీ సర్కార్ హోదాకి బదులు ప్యాకేజీ అంది. చివరకు ప్యాకేజీలో కూడా రాష్ట్రానికి పెద్దగా ఏమీ ఇవ్వకుండానే చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే, ఆయన ప్రత్యేక హోదా నినాదం ఉధృతం చేశారు. క్రమక్రమంగా ఎన్డీఏకు దూరం జరుగుతూ వచ్చి ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం పార్లమెంట్ వేదికగా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే బాబు కేంద్రాన్ని విలన్ గా నిరూపించగలిగారు. వచ్చే ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగేలా చేశారు!

 

 

హోదా విషయంలో బీజేపిని, మోదీని టార్గెట్ చేసిన చంద్రబాబు 25 మంది ఎంపీల్ని ఇస్తే తరువాతి ప్రధాని ఎవరో నేనే నిర్ణయిస్తానంటూ జనానికి తమ వాణి వినిపించారు. మరి జగన్ ఏం చేస్తున్నారు? ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రోజుకో ఎజెండాతో ముందుకు పోతోంది! చంద్రబాబు తుఫాన్ మొత్తం హోదా చుట్టూ కేంద్రీకృతం అయ్యేలా చూస్తే జగన్ ప్రతీ రోజూ చంద్రబాబును తిడుతు కాలం గడిపేస్తున్నారు. అది చాలదన్నట్టు చంద్రబాబును చంపేయ్యండని ఆ మధ్య దురుసుగా మాట్లాడిన జగన్ పవన్ పైన వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆయనకు నలుగురు పెళ్లాలంటూ లేనిపోని వివాదం కొనితెచ్చుకున్నారు! ఇలాంటి వ్యక్తిగత విమర్శలతో ఎన్నికల్లో ఓట్లు ఎలా రాలతాయి? అయితే గియితే మరిన్ని ఓట్లు పోతాయి!

 

జగన్ పవన్ ను తిట్టడం మొదలు రమణ దీక్షితులుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయన చేత విమర్శలు చేయించటం వరకూ నానా రకాలు రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప ఒక ఖచ్చితమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. తాజాగా కాపు రిజర్వేషన్లపై స్వయంగా కాక రేపి చేతులు కాల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వారికి రిజర్వేషన్లు ఇవ్వటం కేంద్రం పరిధిలోనిదని , తన వల్ల ఏం కాదని చేతులు ఎత్తేశారు. మళ్లీ జరిగిన తప్పు గుర్తించి మీడియా నా మాటలు వక్రీకరించిందని రొటీన్ గా గండం నుంచీ గట్టెక్కే ప్రయత్నం చేశారు. ఏ మీడియా ఆయన మాటల్ని వక్రీకరించింది? ఆయన స్వంత సాక్షి కూడానా?

జగన్ కాపు రిజర్వేషన్ల గురించి పబ్లిగ్గా మాట్లాడారు. వేలాది జనం మధ్య తన వాహనంపై నుంచీ ప్రసంగం చేశారు. అవే మాటల్ని మీడియా లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇందులో వక్రీకరించటానికి ఇంకేం మిగిలింది? జగన్ కే తెలియాలి!

 

 

ఒకవైపు చంద్రబాబు తెలివిగా జనం ఆగ్రహాన్ని బీజేపీపైకి, మోదీ పైకి మళ్లించి రానున్న ఎన్నికలకి ఎజెండా సెట్ చేస్తుంటే… జగన్ మాత్రం అనాలోచిత మాటలు, ఆవేశపూరిత చర్యలతో కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ, లోక్ సభల్లో లేరు. పవన్ పై వ్యాఖ్యలతో కాపుల మనో భావాలు దెబ్బతీశారు. ఆపైన రిజర్వేషన్లు నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ఇలా రోజుకో ఘనకార్యం చేస్తుంటే… ఇప్పటిదాకా ఓటు వేద్దామనుకున్న వారు కూడా పునరాలోచనలో పడతారు! ఇది జగన్ గమనించి ఇంకాస్త పరిణతితో వ్యవహరిస్తే బావుంటుంది!