బాబు విశాఖ పర్యటన రద్దు.. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి దెబ్బకొట్టిన సర్కార్!!

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఆయన పర్యటనకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను సోమవారం పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. విశాఖకు విమానంలో రావడానికి రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు అనుమతి కోసం లేఖలు రాశారు. తెలంగాణ నుండి ఆయన పర్యటనకు వెంటనే అనుమతి రాగా, ఏపీ నుండి మాత్రం ఆదివారం సాయంత్రం అనుమతి వచ్చింది. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

అయితే ఊహించని విధంగా, ఏపీకి విమానాల సర్వీసుల ప్రారంభాన్ని సోమవారం నుంచి మంగళవారానికి వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి సోమవారం నుంచి విమాన సర్వీసులు నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో.. సోమవారం విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ ఆదివారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకే విమానాల సర్వీసులను సోమవారం నుంచి మంగళవారానికి వాయిదావేశామని పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

దీంతో టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ఓ వైపు పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, మరోవైపు విమాన సర్వీసులు మొదలుకాకుండా చేసి, ఆయన పర్యటనను దొంగచాటుగా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

చంద్రబాబు పర్యటనకు డీజీపీ సోమవారం వరకే పాస్‌ ఇచ్చారు. మంగళవారం రావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసినా ఎప్పటికి అనుమతిస్తారో తెలియదు. మరోవైపు బుధ, గురువారాల్లో టీడీపీ మహానాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. ఒకవేళ, మంగళవారం విమాన సర్వీసు లు ప్రారంభమైనా.. చంద్రబాబు ఆ ఒక్కరోజులోనే మళ్లీ అనుమతి తీసుకొని వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని  టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

మరోవైపు, చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ పర్యటనకు వెళ్లాలని చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుమతి సోమవారం వరకే ఉండటం, మళ్ళీ మంగళవారం అనుమతి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, బుధ గురు వారాల్లో మహానాడు ఉండటం.. ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు.. హైదరాబాద్‌ నుంచి సోమవారమే అమరావతికి రోడ్డుమార్గంలో వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి విశాఖ పర్యటనతో చంద్రబాబు ఎలాంటి సంచలనాలు రేపుతారో చూడాలి.