రెండు రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు.. ఎందుకు?

 

ఏపీ సీఎం చంద్రబాబు మరికాసేపట్లో అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం  ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు భేటీ అవుతారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వ్యవహారశైలిపై ఎన్నికల సంఘం వద్ద తన అభ్యంతరాన్ని తెలపనున్నారు.

చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎన్ఆర్ క‌మ్మ‌ప‌ల్లె, క‌మ్మ‌ప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లో గత నెల 11న ఎస్సీలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

అయితే ఇదే నియోజకవర్గంలో పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికలు జరిగిన మరుసటి రోజే టీడీపీ ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకోలేదు కానీ.. ఎన్నికలు ముగిసిన దాదాపు నెలరోజుల తరువాత వైసీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే స్పందించి రీపోలింగ్ కి ఈసీ ఆదేశించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారు.