ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు
Published on: Tue Jul 5, 2022 10:45PM
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మదనపల్లెలో బుధవారం జరిగే మినీ మహానాడులో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు అంటే గురువారం (జూలై7) పీలేరులో అన్నమయ్య జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం (జూలై8న) గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో రోడ్ షో ద్వారా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమ వుతున్న నేపథ్యంలో ఈ నెల 6,7,8 తేదీలలో నిర్వహించతలపెట్టిన చంద్రబాబు పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మదనపల్లె, పీలేరుల్లో జరిపే పర్యటనలో చంద్రబాబు పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ముందస్తుగా అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


