అభ్యర్థుల వడపోత.. కొందరికి కోత

ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కతున్నాయి.. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఎన్నికలపై ఉంది.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ముందుగానే కసరత్తు మొదలు పెట్టింది.. గత ఎన్నికలకు, వచ్చే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది.. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ,జనసేనలతో కలిసి నడిచింది.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.. టీడీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది.. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్దే టీడీపీని గెలుపిస్తోందని అధినాయకత్వం భావిస్తోంది.. అదే విధంగా పోలవరం, రాజధాని నిర్మాణం సవ్యంగా జరగాలంటే మళ్ళీ టీడీపీనే అధికారంలోకి రావాలనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చూస్తోంది.. అయితే వీటన్నికంటే ముందు మరో విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. అదే అభ్యర్థుల ఎంపిక.

 

 

ప్రతి నియోజక వర్గంలో కసరత్తు చేసి సరైన అభ్యర్థులను ఎంపిక చేసి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలి అనుకుంటోంది.. ఒకవైపు తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంటే, ఏపీలో టీడీపీ మాత్రం ముందస్తు వద్దు అంటూనే.. అభ్యర్థులను మాత్రం ముందుగా ప్రకటిస్తామంటూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. ముఖ్యంగా వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నారట.. అదే విధంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగులను తప్పించి వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట.. మరోవైపు కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది.. రోజురోజుకి ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతుంది.. ఇలాంటి స్థానాల్లో ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తే నేతల్లో అసంతృప్తి తగ్గుతుందనే అభిప్రాయం ఉంది.. దీనివల్ల ఆశావహులను బుజ్జగించడానికి సమయం ఉంటుందనేది టీడీపీ భావన.. అభ్యర్థిని ముందుగానే ప్రకటించటం వల్ల నియోజక వర్గంలో పట్టు సాధించేందుకు సమయం ఉంటుందని టీడీపీ భావిస్తోంది.

 

 

అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం ఈ ముందస్తు అభ్యర్థుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు.. వైసీపీ నుండి 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు.. వారిని ముందుగానే ప్రకటిస్తే ఎప్పటినుండో టీడీపీలో ఉన్న స్థానిక నేతల్లో అసంతృప్తితో పాటు పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని చంద్రబాబుకి చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన గురించి నేతలతో చర్చలు జరుపుతూ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.