వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్న చంద్రబాబు?

 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎంపీగా పోటీ చేయబోతున్నారట.. ఇది వింటే నమ్మడం ఏమో కానీ నవ్వొస్తుంది అంటారా.. మీరు నమ్ముతారో, నవ్వుతారో మీ ఇష్టం.. కానీ చంద్రబాబు ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. ఈ వార్త పూర్తిగా కొట్టిపడేయలేం అని, చంద్రబాబు ఎంపీగా పోటీచేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం కుప్పం నుండి ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తూనే, ఏదైనా లోక్ సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014 లో బీజేపీ తో కలిసి పని చేసారు.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్నా.. ఏపీకి ప్రత్యేకహోదా రాలేదు, విభజన హామీలు కూడా నెరవేరలేదు.. దీంతో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటికి వచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నారు.. ఈ పోరాటం నుండే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలనే ఆలోచనకు పునాది పడినట్టు తెలుస్తుంది.. ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం బాధ్యతలు అవసరమైతే ఎవరికైనా అప్పగించి.. 

టీడీపీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ.. జాతీయ రాజకీయాల మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారట.. దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని చంద్రబాబు ఆలోచనట.. అయితే ఈ విషయంపై కొందరి భావన వేరేలా ఉంది.. రాష్ట్రాన్ని చంద్రబాబులా సమర్థంగా పాలించే నాయకుడు ఎవరున్నారు?.. ఆయన అలా రాష్ట్రాన్ని వేరొకరికి అప్పగించి జాతీయ రాజకీయాలకి వెళ్లినంత మాత్రాన ప్రయోజనం జరుగుతుందా?.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏం చేస్తారు? అంటూ ఇలా ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నారు.

నిజమో కాదో తెలియని వార్తకే ఇన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. ఒకవేళ నిజమైతే ప్రశ్నల వర్షం కురుస్తుందేమో.. అయితే ఈ విషయంపై విశ్లేషకులు వేరేలా స్పందిస్తున్నారు.. చంద్రబాబు అనుభవం, తెలివితేటలతో పాటు ముందు చూపున్న నేత.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనికి ఎప్పుడేం చేయాలో తెల్సు.. ప్రస్తుతానికి ఇలాంటి వార్తలన్నీ ఊహాగానాలే అంటున్నారు.. చూద్దాం భవిష్యత్తులో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో.