చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకే ఈ చర్యలు!!
Published on: Sat Jun 22, 2019 5:27PM

టీడీపీ అధినేత చంద్రబాబు యూరప్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. విదేశీ పర్యటనలో ఉన్న బాబు పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ప్రజావేదిక స్వాధీనం, బీజేపీలోకి ఎంపీల ఫిరాయింపు అంశాలపై చర్చించారు.
ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్య నేతలు.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఫిరాయింపు కిందికే వస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై నేతలు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. "టీడీపీ ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామికం. దీనిపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నాం. రుణమాఫీ మిగతా విడతల మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలి." సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
"నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పుకుంటున్న బీజేపీ అడ్డగోలుగా ఎంపీలను చేర్చుకుంది. పార్టీలో చేరిన వెంటనే ఆ ఎంపీల పేర్లను రాజ్యసభ వెబ్ సైట్ లో చూపించడం బీజేపీ వ్యవహారశైలి ఎలాంటిదో చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడిన చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకే ఈ చర్యలు." అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.


