టీడీపీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

 

కడప ఉక్కు పరిశ్రమ కోసం ఓ వైపు టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు, లేఖలు ఇలా అన్ని విధాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందించి, ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటానికి వెళ్లిన టీడీపీ ఎంపీల తీరే చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.. టీడీపీ ఎంపీలు సరదాగా దీక్ష గురించి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి లీక్ అయింది.. ఆ వీడియోలో టీడీపీ ఎంపీలు దీక్ష గురించి వెటకారం చేసారు.. జోను లేదు గీను లేదని అవంతి శ్రీనివాస్ అంటే.. నేను ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్న వారం రోజులు దీక్ష చేస్తానని మురళి మోహన్ అన్నారు.. ఈ వీడియోని ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకొని దీక్షల మీద టీడీపీ చిత్తశుద్ధి ఇది అంటూ విమర్శలు చేస్తూ వీడియో షేర్ చేస్తున్నాయి.. ఈ విషయం చంద్రబాబుకి తెలిసి వెంటనే ఎంపీలతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. 

సీఎం రమేష్ ఓవైపు దీక్ష చేస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించిన బాబు, ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దని, ఛలోక్తులకు ఇది సమయం కాదని, మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని హెచ్చరించారట.. చంద్రబాబు సీరియస్‌ కావడంతో ఎంపీలు కూడా వివరణ ఇచ్చారు.. తమ మాటలను కొంతమంది వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లు అన్నారు.. ఆ వీడియోను ఎడిటింగ్ చేశారని 75ఏళ్ల వయస్సులోనూ వారం రోజులు దీక్ష చేయగలమా అన్న మాటల్ని మాత్రం కట్ చేశారని చెప్పారట.. దీనిపై స్పందించిన బాబు, టీడీపీ చేసే పోరాటంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు తెలుస్తుంది.. 

అదే విదంగా, రాష్ట్రం మొత్తం ధర్మపోరాటం వైపు చూస్తోందని.. టీడీపీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. ఒకప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేశారని.. ఇప్పుడు మురళీ మోహన్ మాట్నలి కట్ అండ్ పేస్ట్ చేశారని.. రాష్ట్రానికి హాని చేసే వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉంటూ కుట్రదారుల చేతుల్లో పావుల్లా మారొద్దని బాబు సూచించారు.. ప్రతి క్షణం అప్రమత్తంగా, సీరియస్‌నెస్‌తో ఉండాలన్నారు బాబు.. అలానే అసలు ఆ వీడియో ఎవరు తీశారు? బయటికెలా వచ్చింది? ఎవరు ఎడిట్ చేసారో? విచారించాలని.. ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దీని వెనక ఎవరైనా ఇంటి దొంగ ఉన్నారేమో అన్న విషయం కూడా తెలిసిపోతుందని చెప్పినట్టు తెలుస్తుంది.