కార్యకర్తలే టీడీపీకి బలం.. వారికి పాదాభివందనం

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం  కొనసాగనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు అధినేత చంద్రబాబు, నేతలు నివాళులర్పించారు. 

టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందన్నారు. 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు' అనే బాటలో నడిచాం. టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి అన్నారు. టీడీపీ హయాంలో పేద, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేశామని చెప్పారు. కరోనా కాలంలోనూ ఐటీరంగం వృద్ధి రేటు సాధిస్తోందంటే.. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. టీడీపీ హయాంలోనే సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి శ్రీకారం జరిగిందని చంద్రబాబు తెలిపారు. 

కరోనా ఉధృతి కాలంలో ప్రజలు, టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో సహాయం అందించిన టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలం.. కార్యకర్తలకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశారు.. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి అని కొనియాడారు.

ఈ ఏడాది టీడీపీకి గడ్డుకాలమని, టీడీపీని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు.  శారీరంకగా, మాససికంగా, ఆర్థికంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలని దెబ్బతీశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.