పబ్లిసిటీ ప్రైమ్‌ మినిస్టర్‌

 

కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించారు. బెంగాలీలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని బెంగాలీలో అభినందించారు. అనంతరం ఆంగ్లంలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. భాజపా పై నిప్పులు చెరిగారు. విభజించు పాలించు అనే రీతిలో భాజపా దేశాన్ని పాలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోడీ కేవలం పబ్లిసిటీ ప్రైమ్‌ మినిస్టర్‌ అని విమర్శించారు.