గుంటూరులో చంద్రబాబు లెక్కలు.. వైసీపీకి తప్పవా తిప్పలు

గుంటూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గుంటూరులో ఆది నుండి టీడీపీకి మద్దతుగా నిలుస్తోన్న బిసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపై చంద్రబాబు బిసీలకు ఎక్కడ సీట్లు ఇవ్వాలో? ఎవరు అభ్యర్థులైతే బాగుంటుందో? చెప్పాలని ఆయనకు సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యేను ఆదేశించారు. విద్యాధికులు,ప్రజల్లో మంచిపేరు ఉన్నవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రేపల్లె, మంగళగిరి నియోజకవర్గాలను బీసీలకు కేటాయించారు. తాజాగా మాచెర్లలో బీసీ వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోబోతున్నారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. అదేవిధంగా కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన మంగళగిరి ఇన్‌ఛార్జి చిరంజీవిని మళ్లీ బరిలోకి దింపుతారా? లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఆయన భార్యకు సీటు ఇస్తారా? చూడాల్సి ఉంది. చిరంజీవి సామాజికవర్గమైన పద్మశాలీలు అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఇక్కడ యాదవ, పద్మశాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో బీసీలకు అవకాశం దక్కబోతోంది.

 

 

అప్పట్లో ముస్లింలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వారికి ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. గుంటూరు-1 ముస్లిం వర్గాలకు చెందిన వారిని బరిలోకి దించబోతున్నట్లు సమాచారం. అభ్యర్థి లాల్‌జాన్‌భాషా వారసులు లేక వేరేవారా? అనేది తెలియకపోయినా ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన వైశ్య సామాజికవర్గానికి చెందిన వారిని బుజ్జగించేందుకు వారికి నర్సరావుపేట నుంచి అవకాశం కల్పించబోతున్నారు. తాజాగా బాపట్ల నియోజకవర్గ పరిస్థితిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారిలో మెజార్టీ ఓటర్లు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు.. రెడ్డి సామాజికవర్గానికి చెందని మాజీమంత్రి గాదె వెంకటరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాలని భావిస్తున్నా.. ఆయన తాను నిలబడలేనని, తన కుమారునికి అవకాశం ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన అన్నం సతీష్‌ప్రభాకర్‌ ఓడిపోయిన విషయం విదితమే. మళ్లీ తనకే పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో అన్నం ఉన్నారు. కానీ ఆయన సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని చంద్రబాబు దృష్టికి వెళ్లింది.

 

 

యాదవులు, గౌడ్‌ సామాజికవర్గ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారిలో యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గౌడ సామాజికవర్గానికి చెందిన వారు రేపల్లె నుంచి పోటీ చేస్తుండడంతో ఆ సామాజికవర్గానికి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు లేవు. గతంలో బీసీలకు రెండు సీట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి నాలుగు సీట్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో వైసీపీకి గట్టిపోటీ ఇవ్వవచ్చునని ఎమ్మెల్యేలు, చంద్రబాబు భావిస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో వైసీపీకి మద్దతు ఇస్తోన్న క్రైస్తవ ఓటర్లకు ధీటుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇదే విషయంపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారని, కొందరిని రహస్యంగా పర్యటనలు చేయిస్తున్నారని తెలుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే 1983 నాటి గాలి మళ్లీ వీస్తుందనేది పార్టీ నాయకుల నమ్మకం. జిల్లాలో దళిత సామాజికవర్గానికి మూడు సీట్లు ఉన్న నేపథ్యంలో బీసీలకు రెట్టింపు ఇవ్వకపోయినా కనీసం ఐదు సీట్లు ఇస్తే పరిస్థితి మెరుగుగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.