పులివెందుల తరహా పంచాయితీ ఇక్కడ కుదరదు: బాబు

 

ఉండవల్లిలో తాను అద్దెకు ఉంటున్న నివాసం నదీ పరీవాహకం కిందికి రాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గూగుల్‌లో చూసినా కృష్ణా నది భవాని ఐల్యాండ్‌ నుంచి చూపిస్తుందన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ ఉండటం వల్ల పాయ చీలి నీరు ఇటువైపునకు వస్తోందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాబు కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం వచ్చాక గన్నవరంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయని ఆరోపించారు. సింగపూర్‌ విమానంతో పాటు చాలా విమానాలను రద్దు చేశారని.. ఎక్కడికి వెళ్లాలన్నా మళ్లీ హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని బాబు అన్నారు.

పులివెందుల తరహాలో పంచాయితీలు చేసి ప్రభుత్వ పాలన సాగించలేరని బాబు మండిపడ్డారు. బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పంచాయితీలు పులివెందులలో కుదురుతాయేమోగానీ అమరావతి, ఇతర ప్రాంతాల్లో కుదరవన్నారు. అసెంబ్లీలోనూ సీఎం జగన్ పులివెందుల పంచాయితీల తరహాలోనే వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. 

రాజధాని పరిధిలో దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన భూమి ఉందన్న బాబు.. గతంలో బాగా పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు షేర్ మార్కెట్ తరహాలో పడిపోయిందని వ్యాఖ్యానించారు. రాజధాని పరిధిలో వ్యవస్థ అంతా కుదేలవుతోందని, నిర్మాణాలు ఆగిపోవడంతో రాజధాని ప్రాంతంలోని చాలామంది కూలీలకు ఉపాధి దొరకడం లేదని బాబు విమర్శించారు. పీపీఏలపై స్పందిస్తూ పవన విద్యుత్‌ ధరలు తగ్గించాలని 2018లో తాము పిటిషన్ వేశామని గుర్తుచేశారు. విద్యుత్‌ ధరలు తగ్గించేందుకు తామెంతో కృషి చేస్తే.. విద్యుత్ పీపీఏ ఒప్పందాలపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.