జగన్ ఆ ప్రకటన చేస్తే.. మేము పదవులు వదులుకుంటాం: బాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో కొద్దీ సేపటి క్రితం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇస్తామంటే కరెంటు తీగను పట్టుకొంటారా అని తాను చెప్పినా కూడ ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలు నమ్మి వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ పై బాబు మండిపడ్డారు.

 

మూడు రాజధానుల అంశం పై తాను చేసిన అసెంబ్లీ రద్దు ప్రతిపాదన విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పారిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ రద్దుకు తాను డిమాండ్ చేస్తే వైసీపీ వారు పిరికి పందల్లా పారిపోయారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేస్తే తాము రాజీనామాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఐతే ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు గాను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

అంతే కాకుండా అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని అమరావతిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కూడ ఈ విషయంలో ఏపీకి న్యాయం చేయాలన్నారు. వైసీపీలోని నిజాయితీ గల నేతలంతా కూడ అమరావతికి మద్దతివ్వాలని బాబు కోరారు.
 

తాను చేస్తున్న ఈ పోరాటం నా కోసమో లేక మా పార్టీ కోసమో కాదని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయం పై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్ లను ఆయన ఈ సమావేశంలో ప్రదర్శించారు. సీఎం జగన్ అమరావతి విషయంలో మాట తప్పారు. మడమ తిప్పారని బాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు మూడు రాజధానుల గురించి ఎందుకు చెప్పలేదని ఆయన జగన్ ను ప్రశ్నించారు. ప్రజలకు ద్రోహం చేయడం నీచమన్నారు.

 

ఇప్పటికైనా వైసీపీ నేతలు ఈ విషయంలో డ్రామాలు చేయడం ఆపాలని ఆయన డిమాండ్ చేసారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనే విషయమై తాను రెండు రోజులకు ఒకసారి ప్రజల ముందు అన్ని విషయాలను పెడతానని ఆయన చెప్పారు. ఈ విషయాలపై తాను చెప్పిన అంశాలను ప్రజలంతా చర్చించి ఏది మంచో ఏది చెడో మీరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రం కొన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది. అదే అధికారాన్ని ఆసరాగా చేసుకొని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.