పద్ధతి మార్చుకోండి.. లేకపోతే టికెట్లు దక్కవు.!!

చంద్రబాబు ఓ వైపు అభివృద్ధి మంత్రం జపిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.. కానీ చంద్రబాబు మాత్రం ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వట్లేదు.. ఏ చిన్న ఆరోపణ వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు.. అలాగే మిగతా నేతలు, ఎమ్మెల్యేలు కూడా అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.. దానిలో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరు గురించి నివేదిక తయారు చేపిస్తున్నారు.. ఎవరి పని తీరైనా బాగాలేదని తెలిస్తే వారితో భేటీ అయి ఇక నుండైనా పద్ధతి మార్చుకొని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, లేదంటే ఈసారి టిక్కెట్ కూడా దక్కదని హెచ్చరిస్తున్నారట.

 

 

గత కొన్ని రోజులుగా చంద్రబాబు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో భేటీ అవుతున్నారు.. ఈ భేటీలకు రాయలసీమ నుండి శ్రీకారం చుట్టారు.. ఇప్పటికే నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలతో బాబు భేటీలు పూర్తీ అయ్యాయి.. అయితే ఈ భేటీలు గత భేటీలకు బిన్నంగా జరుగుతున్నాయి.. గతంలో చంద్రబాబు అందరితో భేటీ అయి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేవారు.. కానీ ఈసారి కాస్త పద్ధతి మార్చారు.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో పర్సనల్ గా భేటీ అయి.. నివేదిక ఆధారంగా వారి పనితీరుని బట్టి క్లాస్ పీకుతున్నారు.. ఆ నేతల మీద మరీ ఎక్కువ ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత, సర్వేలు అనుకూలంగా లేకపోవడం ఇలాంటివి నివేదికలో ఉంటే మాత్రం కాస్త గట్టిగానే క్లాస్ పీకుతున్నారట.. పద్ధతి మార్చుకొని ప్రజలకు దగ్గరవండి, లేదంటే మీ స్థానంలో వేరొకరిని మారుస్తాం అంటూ హెచ్చరిస్తున్నారట.

 

 

రాయలసీమలోని ఓ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నీరు- చెట్టు పనులు తమ అనుచరులతో చేయిస్తూ భారీగా గడించారని, ఖరీదైన కార్లు కొనుక్కొని తిరుగుతున్నారని పార్టీ అధిష్టానానికి సమాచారం అందింది.. ఈ భేటీల్లో బాబు, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను దీనిపై ప్రశ్నించారు.. ఆ ఇద్దరూ మాత్రం ఇది ప్రతిపక్షాల ప్రచారమంటూ పరమ రొటీన్ డైలాగ్ కొట్టారు.. ఇంకేముంది చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది.. ఏం జరుగుతుందో నాకు తెలుసు.. ప్రజలు విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు.. దాన్ని నిలుపుకోండి.. సంపాదనలో పడి పార్టీకి మీరు బరువుగా మారితే మిమ్మల్ని మోసుకుంటూ తిరగాల్సిన అవసరం పార్టీకి లేదు.. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి.. ప్రజలకు సన్నిహితంగా ఉండి మంచిపేరు తెచ్చుకోండి.. రాజకీయాల్లో దీర్ఘకాలం నిలబడగలిగేలా మీ పనితీరు ఉండాలి, ఒక్కసారితో పోయేవారి జాబితాలో చేరకండి అని బాబు వారికి గట్టిగానే క్లాస్ పీకారు.. ఇంకెప్పుడు ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకుంటామని ఆ ఇద్దరూ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.. తాను ప్రతినెలా సర్వేలు చేయిస్తున్నానని, వాటిలో పనితీరు మెరుగుపడకపోతే తరువాత తన చేతిలో కూడా ఏమి ఉండదని చంద్రబాబు వారికి తేల్చినట్టు సమాచారం.. మొత్తానికి చంద్రబాబు సర్వేల పుణ్యమా అని అవినీతి అంటే ఎమ్మెల్యేల వెన్నులో వణుకుపుడుతోందట.. ఇది శుభపరిణామమే అని చెప్పాలి.