వైసీపీకి అవగాహన లేదు.. మోదీకి మెచ్యూరిటీ లేదు..!!

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు డ్యామ్‌కు కృష్ణా జలాలు తరలించే ప్రధాన కాలువ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసారు.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన ‘గ్రామదర్శిని- గ్రామ వికాసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు బీజేపీ, వైసీపీలపై మండిపడ్డారు.. వైసీపీ అవగాహన లేని పార్టీ.. ఆ పార్టీకి నాలుగు ఓట్లు వేస్తే, వాటిని కూడా తనపై ఉన్న కేసుల మాఫీకే వాడుకుంటారని జగన్ ని ఉద్దేశించి విమర్శించారు.. 'వైసీపీది రోజుకో మాట.. కాపు కోటా కేంద్రం పరిధిలో ఉందని, తానేమీ చేయలేనని జగన్‌ అన్నారు.. తన వ్యాఖ్యలపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో జగన్‌ తోక ముడిచి మాట మార్చారు' అన్నారు.

 

 

జైలు భయంతోనే జగన్‌ ప్రధానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించిన బాబు.. విభజన హామీలను నెరవేర్చుకోడానికి తాము కూడా కలిసి వస్తామన్న జగన్‌, పవన్‌ల అడ్రస్‌ ఢిల్లీలో కనిపించలేదని ఎద్దేవా చేశారు.. అనంతపురం నుంచే పోటీ చేసి, జిల్లాను బ్రహ్మాండంగా చేస్తానన్న పవన్‌ పత్తా లేకుండా పోయారని విమర్శించారు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తనది యూ టర్న్‌ కాదు, రైట్‌ టర్న్‌.. తనను విమర్శించే వారిదే యూటర్న్‌ అని బాబు అన్నారు.. తనకు పరిణతి లేదని మోదీ వ్యాఖ్యానించారని, అసలు ఆయనకు మెచ్యూరిటీ ఉందా? అని ప్రశ్నించారు.. 'మోదీ అన్నట్టు నేను వైసీపీ వలలో పడలేదు.. బీజేపీయే వైసీపీ కుడితిలో పడింది' అని బాబు ఎద్దేవా చేశారు.. 2014 ఎన్నికల్లో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి బీజేపీతో స్నేహం చేశాం.. కలిసి ఉండి సాధించలేకపోయాం.. ఇప్పుడు పోరాడి సాధించుకుంటాం.. అప్పటికీ చేయకపోతే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మార్చైనా సరే హక్కులు కాపాడుకుంటాం అని బాబు స్పష్టం చేసారు.. తెలుగు వారి బలం తగ్గించడానికి రాష్ట్రాన్ని విభజించారని, ఎన్నికల్లో మొత్తం 25 ఎంపీ సీట్లు టీడీపీ అందిస్తే ప్రధాని ఎవరు కావాలో నిర్ణయించే శక్తి వస్తుందని తెలిపారు.