బాబు ఇల్లు ఖాళీ.. కొత్త ఇంటి కోసం వెతుకులాట!

 

ప్రస్తుతం తాను ఉంటున్న ఉండవల్లిలోని నివాసాన్ని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని కూడా జగన్ ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బాబు అమరావతిలో మరో ఇంటి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన భావిస్తున్నారట. 

ప్రస్తుతం తాను ఉంటున్న నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇప్పటికే చాలా వరకు కూల్చి వేశారు. దాన్ని కూల్చివేసిన తర్వాత బాబు ఉంటున్న భవనాన్ని కూల్చే వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. బాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. దాన్ని కూడా కూల్చివేయక తప్పదని, పరోక్షంగా బాబు తన నివాసాన్ని ఖాళీ చేయాలనే సంకేతాలు ఇస్తున్నారు. 

బాబు.. గుంటూరుకు, విజయవాడకు త్వరగా చేరుకునే విధంగా తన నివాసం ఉండాలని భావిస్తున్నారట. కొత్త ఇల్లు దొరికితే వీలైనంత త్వరగా అందులోకి ప్రస్తుత నివాసాన్ని ఖాళీ చేయాలనీ చూస్తున్నారట. మరోవైపు, రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెం గ్రామానికి చెందిన టీడీపి నేతలు కొందరు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబుకు స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ప్రస్తుతం బాబు ఉంటున్న నివాసంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ స్థితిలో జగన్ ప్రభుత్వం దాన్ని కూల్చివేయడానికి వెంటనే పూనుకుంటుందా, లేక కోర్టు తీర్పు కోసం వేచి చూస్తుందా అనేది తెలియడం లేదు. కూల్చివేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా జగన్ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదని అంటున్నారు.