కేబినెట్ భేటీకి ఈసీ నో చెప్తే.. చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఇదే
Published on: Mon May 13, 2019 1:20PM

ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుందా లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈరోజు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎస్.. సీఎంని కలిసి కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండాపై వివరించినట్టు తెలిపారు. ఇక కేబినెట్ భేటీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు వెల్లడించారు. కాగా, కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఏం చేయాలన్న అంశంపై కూడా సీఎం, సీఎస్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి నిరాకరించిన పక్షంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరవు, ఫణి తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అయితే కేబినెట్ భేటీపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై స్పష్టత వచ్చిన తరువాతే అధికారులతో సమీక్ష అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు.


