అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదు: బాబు
Published on: Fri Jun 14, 2019 2:46PM

విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఐదుసార్లు గెలిచాం.. నాలుగుసార్లు ఓడాం. గెలిచినప్పుడు ఆనందం ఉంటుంది, అలాగే ఓడిపోయినప్పుడు ఆవేదన ఉండటం సహజం’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి సీట్లు తగ్గినా, ఓట్ల శాతం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై దృష్టి సారించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే పార్టీకోసం అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తలకు టీడీపీ నేతలు అండగా నిలవాలనీ.. పార్టీ శ్రేణులపై దాడులు జరిగితే వెంటనే ప్రతిస్పందించాలని ఆదేశించారు.
ఏపీ విభజన అనంతరం తీవ్రమైన ఆర్థికలోటు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామనీ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్లామనీ, ప్రజలపై ఆర్థికలోటు భారం పడనివ్వలేదని చెప్పారు. అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని అన్నారు. ఈ విషయంలో నేతలంతా సమీక్షించుకోవాలన్నారు.


