వారం వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతల మృతి.. టీడీపీకి తీరని లోటు

 

టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"నా చిరకాల మిత్రుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు." అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

శివప్రసాద్‌ మృతి పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. "తెదేపా సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ గారి మృతికి చింతిస్తున్నాను. సినీ కళాకారునిగా, నాయకుడుగా ప్రజల హృదయాలు గెలుచుకున్న నేత శివప్రసాద్ గారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసారు, ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేసారు. శివప్రసాద్ గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని లోకేష్ ట్వీట్ చేసారు.