TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తప్పించుకోవడానికే ఈసీ అలా చెప్పింది.. సిబ్బంది సరిపోతారు

Published on: Tue May 7, 2019 5:07PM

 

వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. కనీసం 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ 21 విపక్ష పార్టీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రివ్యూ పిటిషన్లపై కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ అంశంలో మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేము అని సుప్రీం స్పష్టం చేసింది.

50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విపక్షాలు సుప్రీంను ఆశ్రయించగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని సుప్రీం ఎన్నికల సంఘంను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు మరోసారి సుప్రీంను ఆశ్రయించాయి. కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. అయితే ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు.

సుప్రీం తీర్పు అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘మేం వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే మా కోరిక. వీవీ ప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం లాభం?. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిందేనని గట్టిగా కోరాం. పోలింగ్‌తో పాటు ఓట్ల  లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది మా ఉద్దేశం. మా పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యంలో అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తాం. సుప్రీం తీర్పును గౌరవిస్తూనే మా పోరాటం కొనసాగిస్తాం. వీవీ ప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తాం. మా పోరాటం వల్ల ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడంలో ఈసీకి అభ్యంతరమేంటి? సిబ్బంది సరిపోరని చెప్పడం తప్పించుకోవడమే. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి సిబ్బంది సరిపోతారు’’ అని చంద్రబాబు వివరించారు.