రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు ఈరోజు ఏపీకి వచ్చారు. రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లి‌లో తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబు.. గరికపాడు చెక్‌‌పోస్ట్ దాటారు. చెక్‌ పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు...అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు చేశారు. 

నిజానికి చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లాలనుకున్నారు. వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో చివరి నిమిషంలో విశాఖ పర్యటన వాయిదా పడింది. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి చేరుకున్నారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు.

ఈ నెల 27, 28న మహానాడును నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌లో మహానాడును నిర్వహించనున్నారు. జూమ్ యాప్ ద్వారా సుమారు 14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు.