ఎంపీలకు చంద్రబాబు అభినందన..
Published on: Wed Jul 25, 2018 11:53AM
ఏపీకి జరిగిన అన్యాయంపై నిన్న రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా ఎంపీలు బాగా పోరాడారని సీఎం అభినందించారు.టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.లోక్‌సభలో జయదేవ్, రామ్మోహన్, కేశినేని ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని, అలాగే రాజ్యసభలో సుజనా, సీఎం రమేష్ ప్రసంగాలకు స్పందన బాగుందని అన్నారు.అలానే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలని సీఎం తెలిపారు.రాజధాని, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్ అంశాలపై ఎంపీలు పోరాడాలన్నారు. ఆయా సమస్యలపై మంత్రిత్వ శాఖల వద్ద ఆందోళనలు చేయాలని ఆదేశించారు. అన్యాయాన్ని టీడీపీ సహించదు అనేది ప్రజల్లోకి వెళ్లిందని, ఆ నమ్మకాన్ని ఇకపై కూడా నిలబెట్టుకోవాలని ఎంపీలతో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని వేదికలపై ధ్వజమెత్తాలన్నారు.‘రాజ్యసభలో చర్చ ద్వారా దేశాన్ని మనం మెప్పించగలిగామ’ని తెలిపారు. ఏపీకి మద్దతుగా నిలబడ్డ పార్టీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదాపై తానెప్పుడూ రాజీపడలేదన్నారు.అప్పుడే పుట్టిన బిడ్డకు అనేక సమస్యలు ఉంటాయని, కొత్త రాష్ట్రం కాబట్టి ఇబ్బందులు అధిగమించేందుకే ప్రాధాన్యం ఇచ్చామన్నారు.ఆర్ధికంగా నిలబడేందుకు కృషి చేస్తుంటే అడ్డంగా మాట్లాడటం సరైంది కాదని సూచించారు.


