ఇంటికి ఒక్కరు చాలు.. అమరావతిని రాజధానిగా నిలుపుకునేందుకు బాబు పిలుపు

రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు. 

ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు. 

మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.