నేను కేసీఆర్‌ను విమర్శించను: చంద్రబాబు

 

ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు.

తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు.

బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు.

హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.