టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. టీడీపీ ఎవరికీ భయపడదని, సవాళ్లు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదని అన్నారు. టీడీపీని ఎవరూ కదిలించలేరని చెప్పారు. గతంలో టీడీపీపై బురదజల్లిన వారు అదే బురదలో కూరుకుపోయారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారని.. వారే తమ పార్టీకి శక్తి అని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చెప్పేవారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుదనానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా, ఎన్టీఆర్ జయంతి కావడంతో చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అలాగే, ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.