TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరద బాధితులకు చంద్రన్న ప్యాకేజీ!

Published on: Wed Sep 18, 2024 2:50PM

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల బాధితులకు ప్యాకేజీ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు వరద బాధితులకు సాయంగా అందజేసే ప్యాకేజీ వివరాలను తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాం. విజయవాడ వరదల సమయంలో 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశాను. ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాం. విజయవాడ నగరంలో వారం పది రోజులు వరదలో చిక్కుకుని ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం,  పై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.10 వేలు ఆర్ధిక సాయం ఇస్తాం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలకు ఇల్లు మునిగి ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందిస్తాం. కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఎంఎస్ ఎంఈ లకు, వ్యాపార సంస్థ స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ. 3 వేలు, ఆటోలకు రూ. 10 వేలు అందిస్తాం. అలాగే దెబ్బతిన్న ధాన్యం, ప్రత్తి, చెరకు, వేరుసెనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలకు హెక్టార్‌కు రూ. 35 వేలు సాయం చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలలో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నాం. బ్యాంకులు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నాం. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకు కూడా  పరిహారం అందిస్తున్నాం. వరద సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటించాము."అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.