చంద్రబాబు భద్రత...అక్రమ కట్టడాలు...జగన్ కి తలనొప్పే !

 

నిన్నమొన్నటి దాకా ఏపీలో ప్రజావేదిక హాట్ టాపిక్ గా నిలవగా ఇప్పుడు అందరి దృష్టీ చంద్రబాబు భద్రత మీద పడింది. దానికి ముఖ్య కారణం ఆయన భద్రత తగ్గించడమే. గత పదేళ్ళుగా  ఆయనకు ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత ఉండేదని, ఇప్పుడు కేవలం ఒక షిఫ్టునకు ఇద్దరు కానిస్టేబుళ్లు మిగిలారని, కేవలం కక్షపూరితంగానే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది. గతంలో వైఎస్ మొదటి సారి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబుకు భదత్ర తగ్గించాలని నిర్ణయించి ఎన్‌ఎస్జీ భద్రత కూడా అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసారు. అయితే అప్పట్లో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఎర్రన్నాయుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ను కలిసి ఆయనకు భద్రతా కల్పించాల్సిన విషయం మీద మాట్లాడితే మన్మోహన్‌ వెంటనే భద్రత పునరుద్ధరించడంమే కాక జడ్‌ ప్లస్‌, ఎన్‌ఎ్‌సజీ భదత్ర కల్పించారు. 

కానీ జగన్ ఎన్ఎస్జీని ఏమీ చేయలేదు కానీ ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను కుదిస్తూ వస్తున్నారు. చివరికి ఇద్దరు కానిస్టేబుల్స్ ని ఉంచారు. అయితే ఈ విషయం మీద టీడీపీ నేతలు విమర్శలు చేస్తోంటే ఈ భద్రత తగ్గింపు అంశంపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఏ కేటగిరీ వ్యక్తులకు ఎంత భద్రత కల్పించాలనేది భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఎవరూ కక్షపూరిత నిర్ణయం తీసుకోలేదని కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబుకు చట్టపరిధిలోనే భద్రత కేటాయింపు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ భద్రతా తగ్గింపు అనే అంశం మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కు కి కూడా మోడీ ప్రభుత్వం సిబ్బందిని తగ్గించింది. 

నిజానికి చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జీ కమాండోలతో రక్షణ కల్పించడానికి కారణం చంద్రబాబు మీద జరిగిన అలిపిరి హత్యాయత్నం. ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను తీసుకువెళ్తున్న సమయంలో తిరుమల వెళ్లేముందు అలిపిరిలో ఈ బ్లాస్ట్ చేశారు మావోయిస్ట్ లు. దీంతో ఆనాటి నుండే ఆయనకు ఈ స్థాయి భద్రత కల్పిస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే వైఎస్ అప్పట్లో తగ్గించాలని చూసిన మన్మోహన్ దెబ్బకు వెనక్కి తగ్గారు, మన్మోహన్ ఉన్నంతవరకూ అంతెందుకు మోడీతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చంద్రబాబుకు భద్రతా తగ్గించలేదు కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే ఈ భద్రతా తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోంది. కక్షపూరితంగా చేయట్లేదని చెబుతున్నా అది స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. 

కానీ వాటి సంగతి పక్కన పెట్టి ముందుగా ఈ పని పడతా అన్నట్టు జగన్ చంద్రబాబుని తెలుగుదేశాన్ని, గతంలో ఆ ప్రభుత్వం చేసిన పనుల మీదే మెయిన్ ఫోకస్ పెట్టుకు కూర్చుంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేయచ్చని జగన్ భావించాడు. కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కేంద్రం చంద్రబాబు ప్రభుత్వం పంపిన అంచనాలను ఆమోదించింది. ఈ ఘటనతో మింగుడు పడనీ జగన్ ఏదో ఒక విధంగా బాబుని టార్గెట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ విషయంలో టీడీపీ నేతల స్పందన ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం హుందాగా స్పందిస్తున్నారు. ప్రభుత్వానికి తన మీద కోపం ఉండి భద్రత తగ్గిస్తే తగ్గించనివ్వండని,  ప్రజలే నాకు రక్షకులు దేవుడు, ప్రజల ఆశీస్సుల వల్లే అలిపిరి దాడిలో మృత్యువు నుంచి బయటపడ్డానని, తనకు తన భద్రత సమస్య కాదనీ రాష్ట్రంలో సామాన్యుల భద్రత ముఖ్యం అంటూ చెబుతున్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అవాంఛనీయ పరిస్థితుల పట్ల హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తున్న విధానం సరైంది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  మొన్నటికి మొన్న ఒంగోలులో జరిగిన రేప్ గురించి స్పందిస్తూ ఎన్నో జరుగుతుంటాయి, అంతమాత్రాన ప్రతిచోట ఉండి కాపలా కాయలేం కదా అని ఆవిడ చెప్పుకొచ్చారు. హోంమంత్రే అంటే ఇక సామాన్యుడికి దిక్కెవరని బాబు ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణ వాతావరనం సృష్టించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద కొట్టుకుంటూ ఉంటే పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదనే భావనతో పరిశ్రమలు రావని, యువతకు ఉపాధి అవకాశాలు నిర్వీర్యమవుతాయని, శాంతిభద్రతల అంశమే పెట్టుబడుల్లో కీలకమని ఆయన అంటున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్ర అభివృద్ధికి తానుచేసిన కృషంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంత రైతులు ఆయనను కలిసేందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. చంద్రబాబు మీద నమ్మకంతోనే తాము భూములు ఇచ్చామని ఇప్పుడు ఆయన ఇంటినే కూల్చే పరిస్థితి వస్తే వెలగపూడి, తుళ్లూరు, రావిపూడి గ్రామాల చుట్టుపక్కల ఆయన నివాసానికి స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారు. మరి అజేయ కళ్ళం లాంటి సీనియర్ ఐఏఎస్ లను తన సలహాదారులుగా చేర్చుకున్న జగన్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే జరిగే నష్టం గురించి వారితో చర్చించలేదా ? లేక వారు ఏదైనా సలహా ఇచ్చినా జగన్ పట్టించుకోవడం లేదా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

ఎక్కడైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందుగా ద్రుష్టి పెట్టేది రాష్ట్ర అభివృద్ధి మీద, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం అక్రమం, అవినీతి అంటూ వేరేవాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది. పాజిటివిటీ మీద పనులు చేసుకుంటూ వెళ్ళాల్సింది పోయి, నెగిటివిటీతో జరిగిన పనులను, ఇబ్బంది లేకున్నా అక్రమ కట్టడాల మీద చూపిస్తున్న జులుం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేదే, అది ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకపోవచ్చు కానీ, జగన్ కి ఆ ప్రభావం ఖచ్చితంగా అర్ధం అయ్యే రోజు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.